భువనగిరి జిల్లాలోని ప్రాజెక్టులు పూర్తి చేయాలంటూ సీపీఎం ఆధ్వర్యంలో పాదయాత్ర

మేడిపల్లి, ఆగస్టు30(క్విక్ టుడే న్యూస్):
యాదాద్రి భువనగిరి జిల్లా ఏర్పాటై పదేళ్లు పూర్తవుతున్నా జిల్లాలో కీలకమైన సాగు, తాగునీటి ప్రాజెక్టులు ఇంకా పూర్తికాకపోవడం ప్రభుత్వాల నిర్లక్ష్యానికి అద్దం పడుతోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్ విమర్శించారు. పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులకు అవసరమైన నిధులను వెంటనే మంజూరు చేసి, పనులు ఎప్పటిలోగా పూర్తి చేస్తారో ప్రభుత్వం స్పష్టమైన కాలపరిమితిని ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. జిల్లాలో అసంపూర్తిగా ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలనే ప్రధాన డిమాండ్‌తో సీపీఎం యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ చేపట్టిన హైదరాబాద్ పాదయాత్ర రెండో రోజు ఘట్కేసర్, మేడిపల్లి మీదుగా ఉప్పల్‌కు చేరుకుంది. బోడుప్పల్ సర్కిల్ పరిధిలోని పీర్జాదిగూడ వద్ద నిర్వహించిన విలేకరుల సమావేశంలో జహంగీర్ మాట్లాడారు. వ్యవసాయంపై ఆధారపడిన యాదాద్రి భువనగిరి జిల్లాలో సాగునీటి వసతులు కొరవడటంతో లక్షలాది మంది చిన్న, సన్నకారు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన తెలిపారు. బునాదిగాని, ధర్మారెడ్డి, పిల్లాయిపల్లి కాల్వల నిర్మాణ పనులకు నిధులు విడుదల చేయకపోవడంతో అవి అసంపూర్తిగా మిగిలిపోయాయని పేర్కొన్నారు. బస్వాపూర్, గంధమల్ల, చర్లగూడెం తదితర బహుళార్థసాధక ప్రాజెక్టులు సైతం నిధుల కొరత కారణంగా ముందుకు సాగడం లేదని జహంగీర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టులు పూర్తికాకపోవడంతో జిల్లాలో సాగునీటితో పాటు తాగునీటి సమస్యలు కూడా కొనసాగుతున్నాయని అన్నారు. నవాబుపేట రిజర్వాయర్ నుంచి గుండాల మండలానికి, అశ్వరాయిపల్లి నుంచి ఆలేరు ప్రాంతానికి నీటిని తరలించేందుకు నిర్మించిన కాల్వల్లో 15 ఏళ్లకు పైగా నీటి ప్రవాహం లేకపోవడంతో అవి నిరుపయోగంగా మారిపోయాయని తెలిపారు. కాల్వల్లో గడ్డి పెరిగి శిథిలావస్థకు చేరినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు.
నారాయణపురం, చౌటుప్పల్ ప్రాంతాలకు అత్యంత ప్రాధాన్యమైన రాచకొండ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఎందుకు నిలిచిపోయాయో ప్రభుత్వం ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. అలాగే ఆసిఫ్‌నగర్, బృందావనం కాల్వలను పునరుద్ధరించాలని కోరారు. కలుషితమైన మూసి నీటి కారణంగా భువనగిరి ప్రాంత ప్రజల ఆరోగ్యం తీవ్రంగా ప్రభావితమవుతోందని పేర్కొన్నారు. మూసి పరివాహక ప్రాంతానికి గోదావరి జలాలను అందించడమే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారమని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ, బట్టుపల్లి అనురాధ, డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి అవనగంటి వెంకటేష్, సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాటూరి బాలరాజు, దాసరి పాండు, జిల్లా కమిటీ సభ్యులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి, గడ్డం వెంకటేశ్, వనం ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు. స్వాగతం పలికిన వారిలో సీపీఎం మేడ్చల్ జిల్లా నాయకులు చింతల యాదయ్య, సబితా, మేడిపల్లి మండల కార్యదర్శి ఎన్.సృజన, కర్రె జంగయ్య, కుమార్, అంజయ్య గౌడ్, పాపయ్య, శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు.





