తెలంగాణ అభివృద్ధిలో ఆగా ఖాన్ ఫౌండేషన్ మరింత భాగస్వామ్యం
ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్-5కు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి

హైదరాబాద్, సెప్టెంబర్15(క్విక్ టుడే న్యూస్):
తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో ఆగా ఖాన్ ఫౌండేషన్ మరింతగా భాగస్వామ్యం కావాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని విద్య, వైద్యం, పర్యాటక రంగాల్లో ఫౌండేషన్‌తో కలిసి పనిచేయాలని ఆయన కోరారు. భారత పర్యటనలో భాగంగా హైదరాబాద్‌కు వచ్చిన ఆగా ఖాన్ ఫౌండేషన్ చైర్మన్ హిజ్ హైనెస్ ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్-Vతో సీఎం రేవంత్ రెడ్డి తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. తెలంగాణ వారసత్వ సంపద పరిరక్షణ, పునరుద్ధరణలో ఆగా ఖాన్ ఫౌండేషన్ అందిస్తున్న సేవలను సీఎం గుర్తుచేశారు. హైదరాబాద్‌తో ఆగా ఖాన్ కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని ప్రస్తావిస్తూ ఫౌండేషన్‌పై తనకు ఎంతో గౌరవం ఉందన్నారు. ఫౌండేషన్ సహకారంతో భవనం, కుతుబ్ షాహీ టూంబ్స్ పునరుద్ధరణ చేపట్టిన విషయాన్ని గుర్తుచేశారు. హైదరాబాద్ పునర్నిర్మాణంలో భాగంగా చేపడుతున్న మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టు ప్రణాళికలను సీఎం వివరించారు. మూసీ పరివాహక ప్రాంతాన్ని నైట్ ఎకానమీకి అనుగుణంగా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. చారిత్రక సిటీ కాలేజ్, ఉస్మానియా ఆసుపత్రి భవనాల పునరుద్ధరణలో ఆగా ఖాన్ ఫౌండేషన్ సహకరించాలని కోరారు. ఉస్మానియా ఆసుపత్రి కోసం గోషామహల్లో నూతన భవనాన్ని నిర్మిస్తున్నామని, ప్రస్తుత ఆసుపత్రి భవనాన్ని చారిత్రక వారసత్వ కట్టడంగా అభివృద్ధి చేయాలన్నది ప్రభుత్వ ఉద్దేశమని సీఎం వివరించారు. డిసెంబర్ 7 నుంచి 9 వరకు మూడు రోజుల పాటు భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్వహించనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్-Vను సీఎం ఆహ్వానించారు.
ఈ సదస్సుకు 100కు పైగా దేశాల నుంచి ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు. ఫ్యూచర్ సిటీ నిర్మాణంపై ప్రిన్స్ ఆగా ఖాన్-V ఆసక్తి చూపగా, దాని ప్రాధాన్యతను సీఎం వివరించారు. సుమారు 30 వేల ఎకరాల్లో అత్యాధునిక సదుపాయాలతో ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నామని రేవంత్ రెడ్డి తెలిపారు. అంతర్జాతీయ విమానాశ్రయానికి 20 నిమిషాల దూరంలో అభివృద్ధి చేస్తున్న ఈ నగరాన్ని పూర్తిగా నెట్-జీరో సిటీగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. సింగపూర్‌కు చెందిన సంస్థ ఫ్యూచర్ సిటీ మాస్టర్ ప్లాన్ రూపొందిస్తోందని, ఇందులో సుమారు 15 వేల ఎకరాలను గ్రీన్ జోన్‌గా అభివృద్ధి చేస్తున్నట్లు వివరించారు. అమెజాన్ వంటి సంస్థలు ఇప్పటికే ఫ్యూచర్ సిటీలో కార్యకలాపాలు ప్రారంభించాయని తెలిపారు. 2047 నాటికి దేశ జీడీపీలో తెలంగాణ వాటాను 10 శాతానికి పెంచే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఇటీవల బ్రిటన్, అమెరికా పర్యటనల్లో ప్రపంచస్థాయి విశ్వవిద్యాలయాలతో తెలంగాణ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలను సీఎం సలహాదారు కె. రామకృష్ణారావు ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్-Vకు వివరించారు. హార్వర్డ్ యూనివర్సిటీ, లండన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ సహా పలు అంతర్జాతీయ విద్యాసంస్థలు హైదరాబాద్‌లో కార్యకలాపాలు ప్రారంభించేందుకు అంగీకరించినట్లు తెలిపారు. ఫ్యూచర్ సిటీలో ఆగా ఖాన్ యూనివర్సిటీ ఏర్పాటు రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితా రాణా కోరారు.





