అసెంబ్లీ ఘటన కేసులో కేటీఆర్ పీఏ, పీఆర్వోల విచారణ
సైఫాబాద్ పోలీసుల ఎదుట హాజరై వివరణ ఇచ్చిన సహాయకులు

తెలంగాణ అసెంబ్లీ వద్ద సెప్టెంబర్ 7న చోటుచేసుకున్న ఉద్రిక్తతకు సంబంధించి నమోదైన కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యక్తిగత సహాయకుడు కుంబాల మహేందర్‌రెడ్డి, ప్రజా సంబంధాల అధికారి మాణిక్య మహేశ్ సోమవారం సైఫాబాద్ పోలీసుల ఎదుట హాజరయ్యారు. పోలీసులు జారీ చేసిన నోటీసుల మేరకు దర్యాప్తు అధికారిని కలిసి తమ వాదనను, వివరణను వెల్లడించారు. అసెంబ్లీ ప్రాంగణం సమీపంలో విధుల్లో ఉన్న పోలీసు సిబ్బంది విధులకు ఆటంకం కలిగించారన్న ఆరోపణలతో వీరిద్దరిపై సెప్టెంబర్ 9న కేసు నమోదైంది. రిజర్వ్ ఇన్స్పెక్టర్ బి. జంగయ్య ఫిర్యాదు ఆధారంగా భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్)లోని పలు నిబంధనల కింద సైఫాబాద్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కేసు నమోదైన అనంతరం కేటీఆర్ సహాయకులు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ కొనసాగించేందుకు పోలీసులకు అవకాశం కల్పించిన న్యాయస్థానం.. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు వారిపై కఠిన చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది. సెప్టెంబర్ 7న కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావుతో పాటు పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో కూడిన నల్ల టీ-షర్టులు ధరించి అసెంబ్లీకి వెళ్లారు. రాజకీయ నినాదాలున్న దుస్తులతో అసెంబ్లీ లోపలికి అనుమతి లేదని పోలీసులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. ఈ ఘటన అనంతరం పోలీసులు పలు కేసులు నమోదు చేశారు. కేటీఆర్, హరీశ్‌రావు సహా 12 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై ఇప్పటికే రెండు కేసులు నమోదయ్యాయి. మహిళా పోలీసుల విధులకు ఆటంకం కలిగించడంతో పాటు వారితో అనుచితంగా ప్రవర్తించారన్నది ప్రధాన ఆరోపణగా ఉంది. అసెంబ్లీ స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలపై మరో కేసు నమోదైంది. ఇదిలా ఉండగా.. పోలీసులే తమ మహిళా ఎమ్మెల్యేల పట్ల దురుసుగా వ్యవహరించారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఈ వ్యవహారంపై జాతీయ మానవ హక్కుల కమిషన్, జాతీయ మహిళా కమిషన్‌తో పాటు గవర్నర్‌కు ఆ పార్టీ నేతలు ఫిర్యాదులు సమర్పించారు.





