ఆగస్టు 3వరకూ గాంధీ భవన్‌కు రావొద్దు
కాంగ్రెస్ పార్టీ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు

పదవుల కోసం వచ్చేవారికి అపాయింట్మెంట్ ఇవ్వొద్దు
కాంగ్రెస్ పార్టీ నేతలందరూ క్షేత్రస్థాయిలోనే పనిచేయాలి
ఎన్నికల ప్రచారం తరహాలో సర్ ప్రక్రియలో పాల్గొనండి
హైదరాబాద్, జూలై20(క్విక్ టుడే న్యూస్):
రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు నియోజకవర్గాల్లో ప్రజల మధ్య ఉండి ఎన్నికల ప్రచారం తరహాలో పనిచేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఆగస్టు 3 వరకు పార్టీ కార్యాలయం గాంధీభవన్‌కు ఎవరూ రావద్దని, పదవులు లేదా నామినేటెడ్ పోస్టుల కోసం వచ్చే వారికి అపాయింట్మెంట్లు ఇవ్వవద్దని పార్టీ అగ్రనాయకత్వాన్ని ఆదేశించారు. నియోజకవర్గాల్లో కాకుండా హైదరాబాద్‌లోనే ఉంటూ క్షేత్రస్థాయిలో పనిచేయని కొందరు నేతల తీరుపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. సోమవారం నుంచి ఆగస్టు 3 వరకు ఇన్‌ఛార్జి మంత్రులు అన్ని జిల్లాల్లో సమీక్షలు నిర్వహిస్తారని, ఈ సమయంలో ప్రతి నాయకుడు తన నియోజకవర్గంలోనే ఉండి పార్టీ కార్యక్రమాలను వేగవంతం చేయాలని సూచించారు. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇప్పటికే 489 సమావేశాలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ముఖ్యంగా వెనుకబడిన నియోజకవర్గాల నాయకులు మరింత చురుకుగా వ్యవహరించాలని సూచించారు.
పార్లమెంట్ సమావేశాల్లో ఎంపీలు బిజీగా ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయి సమీక్షలు మాత్రం నిరంతరంగా కొనసాగించాలని చెప్పారు. ఇన్‌ఛార్జి బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించని వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బూత్ స్థాయి అధికారుల నివేదికలపై మాత్రమే ఆధారపడకుండా, పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్ల (బీఎల్ఏ) నివేదికలను కూడా సమగ్రంగా పరిశీలించాలని సీఎం సూచించారు. కేవలం అధికారుల నివేదికల ఆధారంగా వ్యవహరిస్తే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రాబోయే పది రోజుల పాటు కాంగ్రెస్ నాయకులంతా ఎన్నికల ప్రచారం తరహాలో నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించాలని, పదవుల కోసం హైదరాబాద్ చుట్టూ తిరగడం మానుకోవాలని రేవంత్ రెడ్డి సూచించారు.
జూలై 30న ఎస్ఐఆర్ ప్రక్రియపై మరోసారి సమగ్ర సమీక్ష నిర్వహిస్తామని తెలిపారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా సమన్వయం చేయాలని ఆదేశించారు. ఆగస్టు 3 వరకు సర్ ప్రక్రియపైనే పూర్తి దృష్టి పెట్టాలని, గాంధీభవన్‌కు పైరవీల కోసం ఎవరూ రావద్దని మరోసారి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 100 మంది బీఎల్ఏలకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కలిసే అవకాశం కల్పించి, ఆయనతో ఫొటో దిగే అవకాశం కూడా ఇస్తామని సీఎం ప్రకటించారు.

