BRS MP Candidates List : 17 మంది బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్.. ఒవైసీకి దీటుగా ఎవరిని దింపుతున్నారో తెలుసా?
ఈనేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా ఎన్నికల హడావుడే కనిపిస్తోంది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాస్త చల్లబడిన రాజకీయాలు.. మళ్లీ ఊపందుకున్నాయి. పార్లమెంట్ ఎన్నికల కోసం ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పోటీ పడుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో చతికిలపడిపోయింది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత పరిస్థితులన్నీ తలకిందులుగా మారాయి. బీఆర్ఎస్ పార్టీలో ఒకప్పుడు ఒక్క స్థానానికే తీవ్ర పోటీ ఉండేది. కానీ.. ఇప్పుడు చూస్తే పరిస్థితులు అలా లేవు. అసలు నాయకులే లేరు పార్టీలో. బీఆర్ఎస్ పార్టీలో లీడర్ల కొరత ఏర్పడింది.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే బీఆర్ఎస్ లో ఉన్న ముఖ్య నేతలంతా కాంగ్రెస్ లో చేరడం మొదలు పెట్టారు. దీంతో బీఆర్ఎస్ ఖాళీ అయిపోయింది. అయినా కూడా అక్కడా ఇక్కడా వెతికి చివరకు 17 మంది ఎంపీ అభ్యర్థులను బరిలో నింపుతున్నారు కేసీఆర్.
ఖమ్మం నుంచి నామా నాగేశ్వర రావు, మహబూబాబాద్ నుంచి మాలోత్ కవిత, కరీంనగర్ నుంచి బోయినిపల్లి వినోద్ కుమార్, పెద్దపల్లి నుంచి కొప్పుల ఈశ్వర్, మహబూబ్ నగర్ నుంచి మన్నె శ్రీనివాస్ రెడ్డి, చేవెళ్ల నుంచి కాసాని జ్ఞానేశ్వర్, వరంగల్ నుంచి కడియం కావ్య, నిజామాబాద్ నుంచి బాజిరెడ్డి గోవర్ధన్, జహీరాబాద్ నుంచి గాలి అనీల్ కుమార్, ఆదిలాబాద్ నుంచి ఆత్రం సకక్కు, మల్కాజిగిరి నుంచి రాగిడి లక్ష్మారెడ్డి, మెదక్ నుంచి వెంకట్రామి రెడ్డి, నాగర్ కర్నూల్ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, సికింద్రాబాద్ నుంచి పద్మారావు గౌడ్, భువనగిరి నుంచి క్యామ మల్లేష్, నల్గొండ నుంచి కంచర్ల కృష్ణారెడ్డి, హైదరాబాద్ నుంచి గడ్డం శ్రీనివాస్ యాదవ్ ను బరిలోకి దించారు.
అయితే.. ఇందులో హైదరాబాద్ అభ్యర్థి గురించి మాట్లాడుకోవాలి. హైదరాబాద్ నియోజకవర్గం అంటేనే ముస్లిం ఓటర్లు అధికంగా ఉండే నియోజకవర్గం. అక్కడి నుంచి బీసీ అభ్యర్థి గడ్డం శ్రీనివాస్ యాదవ్ ను కేసీఆర్ బరిలోకి దించారు. హైదరాబాద్ నుంచి ఎంఐఎం అధినేత అసదుద్దీన్ కూడా పోటీ చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి ప్రతి సారీ అసదుద్దీన్ గెలవడం పరిపాటి.
కానీ.. ఈసారి బీఆర్ఎస్ నుంచి హైదరాబాద్ లో బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతను కేసీఆర్ బరిలోకి దింపారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత చాలామంది పార్టీ నుంచి వెళ్లిపోయారు కానీ.. ఎవ్వరూ పార్టీలోకి తిరిగి రాలేదు. కానీ.. ఒక్క బీఎస్పీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాత్రమే బీఆర్ఎస్ లో చేరారు. దీంతో ఆయనకు నాగర్ కర్నూల్ నియోజకవర్గం నుంచి ఎంపీ సీటును కేటాయించారు కేసీఆర్.