Pawan Kalyan VS Vanga Geetha : పిఠాపురంలో పవన్ గెలుపు కష్టమేనా? వంగ గీతకు ఉన్న ప్లస్ పాయింట్సే జనసేనానికి మైనస్ కానున్నాయా?
ఏపీలో అధికార వైసీపీ పార్టీ ఒకవైపు ఉంటే.. బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి మరోవైపు ఉంది. ప్రధానంగా వైసీపీ, కూటమి మధ్యనే పోటీ నెలకొన్నది. అందులోనూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసే నియోజకవర్గంపైనే అందరి దృష్టి పడింది.
ఎన్నికల పొత్తులో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు పిఠాపురం నియోజకవర్గం నుంచి టికెట్ లభించింది. దీంతో పిఠాపురంలో గెలుపు కోసం పవన్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. కూటమితో పొత్తు కారణంగా పవన్ కళ్యాణ్ పార్టీ జనసేనకు 21 అసెంబ్లీ టికెట్లను కేటాయించగా, 2 లోక్ సభ స్థానాలను కేటాయించారు.
పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కు ప్రధాన పోటీ అధికార వైసీపీ అభ్యర్థి వంగ గీతతోనే. ఆమెతోనే పవన్ కు పోటీ నెలకొన్నది. నిజానికి పవన్ కళ్యాణ్ ఒక రాజకీయ నాయకుడు మాత్రమే కాదు. సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్. ఆయనకు కోట్ల మంది అభిమానుల ఫాలోయింగ్ ఉంది. అయినా కూడా గత ఎన్నికల్లో గెలవలేకపోయారు.
Pawan Kalyan VS Vanga Geetha : వంగ గీత పేరే ఎందుకు ఎక్కువగా వినిపిస్తోంది?
స్టార్ హీరో ఇమేజ్ తో బరిలోకి దిగినా కూడా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిచే అవకాశాలు తక్కువగానే ఉన్నాయని స్థానికంగా వినిపిస్తోంది. దానికి కారణం.. వైసీపీ అభ్యర్థి వంగ గీత. ఆమెకు నియోజకవర్గంలో మంచి పేరు ఉంది. ఆమె ప్రస్తుతం కాకినాడ ఎంపీగా ఉన్నారు. ఆమె వివాదరహిత నాయకురాలిగా గుర్తింపు తెచ్చుకున్నారు.
అందులోనూ అధికార పార్టీ ఇప్పటి వరకు తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు చాలు ఆమెను గెలిపించడానికి అని పిఠాపురం స్థానిక వైసీపీ నాయకులు చెబుతున్నారు. వంగ గీతకు ఓటమి అనేదే తెలియదు. తను గత ఎన్నికల్లో ఎంపీగా గెలిచారు. అందులోనూ తనకు పిఠాపురం నియోజకవర్గంలో మంచి పేరు ఉంది. తను 24 గంటలు నియోజకవర్గంలోనే తిరుగుతూ ప్రజల కష్టసుఖాలను తెలుసుకోవడంలో ముందుంటారు.
ఆమె ఎమ్మెల్యేగానూ ఇదివరకు ఎన్నికయ్యారు. వంగ గీత కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకురాలు. ఆమెకు స్థానికత పెద్ద ప్లస్ పాయింట్ కానుంది. అలాగే సౌమ్యురాలుగానూ పేరు ఉంది. తన రాజకీయ ప్రస్థానాన్ని వంగ గీత టీడీపీతోనే ప్రారంభించారు. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇప్పుడు వైసీపీ పార్టీ నుంచి కాకినాడ ఎంపీగా ఉన్నారు.
పిఠాపురం తన సొంత నియోజకవర్గం కావడంతో పాటు కాపు ఓటర్లు ఎక్కువగా ఉండటంతో పవన్ కంటే కూడా గెలిచే అవకాశాలు తనకే ఎక్కువగా ఉన్నట్టు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కాపు సామాజిక వర్గ ఓట్లు పిఠాపురం నియోజకవర్గంలో కనీసం లక్ష వరకు ఉంటాయి. అందులో తనకు సగం పడినా కూడా మిగితా ఓట్లలో మరో 50 శాతం వచ్చినా తన గెలుపు ఖాయం.
పిఠాపురం నియోజకవర్గంలో మొత్తం 2 లక్షల 20 వేల మంది ఓటర్లు ఉన్నారు. అందులో 50 శాతం కాపు ఓట్లు పడినా, బీసీ, ఎస్సీ సామాజికవర్గానికి చెందిన వాళ్లు 50 శాతం కంటే ఎక్కువ ఓట్లు వేసినా చాలు. ఎందుకంటే వాళ్లంతా సీఎం జగన్ తీసుకొచ్చిన సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందిన వారే.
ఈ లెక్కన చూసుకుంటే పవన్ కళ్యాణ్ కంటే కూడా పిఠాపురం నియోజకవర్గంలో వంగ గీతకే ఎక్కువ ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. అవే పవన్ కు మైనస్ అయ్యే చాన్స్ ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. చూడాలి మరి.. జనసేనాని చరిష్మా పిఠాపురంలో వర్కవుట్ అవుతుందా? ఈసారైనా పవన్ అసెంబ్లీలో అడుగుపెడతారా? అనేది.