MLA Beerla Ilaiah: యాదాద్రి భువనగిరి, క్విక్ టుడే : యాదగిరిగుట్టలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు దర్శించుకోవడం హర్షించదగిన విషయం అని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కొండా సురేఖ తదితరులు హాజరు కావడం శుభపరిణామమని అన్నారు. శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయంలో ముఖ్యమంత్రి దాదాపు గంటన్నర పాటు కలియతిరిగి భక్తులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసున్నారు. అనంతరం సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అయితే ముఖ్యమంత్రి పర్యటనలో కొందరు సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని, ఇది ఓర్వలేని తనంతో చేస్తున్న దుర్బుద్ధి అని ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. గత పాలకులు యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాల్లో ఎవరికీ ప్రాధాన్యత ఇవ్వలేదని విషయాన్ని గుర్తు చేశారు.
గిట్టని వారు సోషల్ మీడియా వేదికగా డిప్యూటీ సీఎం పట్ల దుష్ప్రచారం చేయడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దృష్టిలో అందరికీ సమాన గౌరవం ఉంటుందని, మేము కూడా అందర్నీ సమానంగా గౌరవించామని తెలిపారు. ముఖ్యమంత్రి సందర్శనార్థం వచ్చినప్పుడు వారికి కేటాయించిన సీట్లు హెచ్చుతగ్గు ఉండటం వల్ల భట్టి విక్రమార్క తక్కువ ఎత్తులో కూర్చున్నట్లు వివరణ ఇచ్చారు. అయితే దీనిని కొందరు సోషల్ మీడియా వేదికగా గిట్టని వాళ్లు అవమానించినట్లు వక్రీకరించడం తగదన్నారు. యాదగిరిగుట్ట దేవస్థానం బ్రహ్మోత్సవాలకు సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి హాజరు కావడాన్ని కొందరు జీర్ణించుకోలేకపోతున్నారని, దీనిని తప్పుగా ప్రచారం చేయాలని నిర్ణయించి కించపరిచేటట్లు సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేశారని అన్నారు.
మరో వారం రోజుల్లో రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేస్తామని, యాదగిరిగుట్టకు రావాల్సిన నిధులను తీసుకొచ్చి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. గాలి గోపురానికి బంగారు తాపడం, హోమం చేయాలని ముఖ్యమంత్రి సూచించగా ఆయన సానుకూలంగా స్పందించినట్టు ఎమ్మెల్యే తెలిపారు. బ్రహ్మోత్సవాలకి ముఖ్యమంత్రి, మంత్రులు రావడం సంతోషించదగ్గ విషయమని అన్నారు. కొంతమంది గిట్టనివారు పనిగట్టుకుని ప్రభుత్వంపై చెడ్డ పేరు తేవాలని చూస్తున్నారని, ఎక్కడ చిన్న చిన్న లోపాలను ఉంటాయో వెతికి వాటిని పెద్దగా చేయాలని చూస్తున్నారని అన్నారు.