Modi Mega Road Show : విజయవాడలో మోదీ భారీ రోడ్ షో.. పవన్, చంద్రబాబు హాజరు..
ఎన్నికలకు ఇంకా 5 రోజుల సమయం కూడా లేదు. ఇంకో మూడు రోజుల్లో ఎన్నికల ప్రచారం కూడా ముగియబోతోంది. అందుకే ప్రధాన పార్టీలు తమ పార్టీల అధినేతలతో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నాయి.
ఎన్నికల ప్రచారం ప్రారంభం కాగానే ప్రధాని మోదీ వచ్చి ఏపీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మళ్లీ తాజాగా ఇవాళ ఏపీకి వచ్చి ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఏపీలో ఎన్నికల ప్రచారానికి ముగింపు పలికారు.
Modi Mega Road Show : మోదీకి ప్రజల బ్రహ్మరథం
విజయవాడలో ప్రధాని మోదీ మెగా రోడ్ షో నిర్వహించారు. ఈసందర్భంగా ప్రధాని మోదీకి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. మున్సిపల్ స్టేడియం నుంచి ఈ రోడ్ షో ప్రారంభం అయింది. ఈ రోడ్ షోలో ప్రధాని మోదీతో పాటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు.
మూడు పార్టీల అగ్రనేతలు ముగ్గురూ ఒకే వేదికపై నిలబడి ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. మున్సిపల్ స్టేడియం నుంచి బెంజి సర్కిల్ వరకు రోడ్ షో నిర్వహించారు. కూటమి గెలుపే లక్ష్యంగా ప్రధాని మోదీ ఏపీలో పర్యటిస్తున్నారు. ఈసందర్భంగా 5 వేల మందితో హై సెక్యూరిటీ మధ్య మోదీ రోడ్ షో నిర్వహించారు.
ఇప్పటి వరకు మోదీ నాలుగు బహిరంగ సభలకు ఏపీకి వచ్చారు. ముందుగా చిలకలూరిపేటలో జరిగిన బహిరంగ సభకు మోదీ విచ్చేశారు. రెండో విడతలో భాగంగా రాజమండ్రి, అనకాపల్లి, రాజంపేటలోని సభకు వచ్చారు. రాజంపేట సభ తర్వాత మోదీ విజయవాడ రోడ్ షోలో పాల్గొన్నారు.
ఈసందర్భంగా మాట్లాడిన మోదీ.. ఏపీలోనూ డబుల్ ఇంజన్ సర్కార్ రావాలన్నారు. వికసిత ఆంధ్రా ఎన్డీఏతోనే సాధ్యం అన్నారు. ఎన్డీఏ కూటమికి 400 సీట్లు ఖాయం అన్నారు. పీఎం ఆవాస్ యోజనతో ఏపీలో 10 లక్షల ఇళ్లు నిర్మించామన్నారు. ఆయుష్మాన్ భారత్ కింద 1.25 కోట్ల మంది లబ్ధిదారులు ఉన్నారన్నారు.
జల్ జీవన్ మిషన్ తో కోటి ఇళ్లకు నీరు ఇచ్చామన్నారు. కిసాన్ సమ్మాన్ నిధితో ఒక్క పల్నాడుకే 700 కోట్లు ఇచ్చామన్నారు. ఏపీని ఎడ్యుకేషన్ హబ్ గా మార్చామన్నారు. విశాఖలో ఎంఐఎం, ఐఐపీఈ ఏర్పాటు చేశామన్నారు. తిరుపతిలో ఐఐటీ, ఐసర్ ఏర్పాటు చేశామన్నారు. మంగళగిరి ఎయిమ్స్ ని ప్రతిష్టాత్మకంగా నిర్మించామన్నారు.
అలాగే.. విజయనగరం ట్రైబల్ వర్సిటీ నిర్మాణం బీజేపీ ఘనతే అన్నారు మోదీ. మొత్తం మీద ఏపీలో ప్రధాని మోదీ ఇవాళ్టితో ఎన్నికల ప్రచారానికి విజయవాడ రోడ్ షోతో ముగింపు పలికారు. అందుకే ఈ రోడ్ షోకు భారీగా విజయవాడ ప్రజలు తరలివచ్చారు. రోడ్ షో మొత్తం ఎక్కడ చూసినా మోదీ మోదీ అటూ నినాదాలు హోరెత్తాయి.