Minister Komatireddy Venkat Reddy: ఎమ్మెల్సీ కవిత అరెస్టుపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
కవితను అరెస్ట్ చేసింది ఢిల్లీ పోలీసులైతే.. తెలంగాణలో ధర్నాలు చేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకని మండిపడ్డారు. నాడు చంద్రబాబు అరెస్టు సందర్భంగా జరిగిన ధర్నాలను, ర్యాలీలను అడ్డుకున్న వ్యక్తులే ఇవాళ ధర్నాలకు పిలుపునివ్వడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు.ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన విషయాలకు హైదరాబాద్‌లో ధర్నాలెందుకని ప్రశ్నించిన బీఆర్ఎస్ నాయకులు.. ఢిల్లీకి చెందిన ఈడీ అధికారులు అరెస్టు చేస్తే తెలంగాణలో ధర్నాలకు ఎందుకు పిలుపునిస్తున్నారని ప్రశ్నించారు.
ప్రాజెక్టుల నిర్మాణంలో అక్రమంగా సంపాదించిన డబ్బుతో స్పెషల్ ఫ్లైట్లు బుక్ చేసి బీఆర్ఎస్ కార్యకర్తలను ఢిల్లీకి తీసుకపోయి ఈడీ ఆఫీసు ముందు ధర్నాలు దీక్షలు చేసుకోండి అని హితవు పలికారు. ఎవడొస్తడో రండి చూసుకుందాం అని తొడకొట్టి..ఇప్పుడు కార్యకర్తలను రోడ్లమీదకి తేవడం ఎందుకు అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పాలనతో ప్రజల జీవితాల్లో ఇప్పుడిప్పుడే వెలుగులు నిండుతున్నాయి అన్నారు.
మళ్లీ మీ కుటిల రాజకీయాలతో తెలంగాణ ప్రజల్ని ఇబ్బందులు పెట్టకండని హితవు పలికారు. ఏపీ ముఖ్యమంత్రితో కుమ్మక్కై రాయలసీమకు నీళ్లివ్వడం మూలంగా ఇవాళ తెలంగాణ ప్రాజెక్టులన్నీ అడుగంటిపోయాయని తెలిపారు. రైతులు కరువుతో అల్లాడితోపోతుంటే.. మీ లిక్కర్ రాజకీయాలకు రాష్ట్రాన్ని రావణకాష్టంగా మార్చాలనుకుంటున్నారా..? అని ఘాటుగా కోమటిరెడ్డి స్పందించారు.