Kadapa Lok Sabha Elections 2024 : కడపలో కుటుంబ పోరు.. గెలుపు ఎవరిదో...
కడప నుంచి లోక్ సభ ఎంపీగా ఇప్పటికే వైసీపీకి చెందిన అవినాష్ రెడ్డి ఉన్నారు. ఆయన ఎవరో కాదు.. జగన్ కు తమ్ముడు. అంటే బాబాయి కొడుకు. 2019 ఎన్నికల్లో వైఎస్ అవినాష్ రెడ్డి భారీ మెజార్టీతో గెలిచారు. ఇప్పుడు మళ్లీ 2024 ఎన్నికల్లోనూ అవినాష్ రెడ్డికే వైసీపీ నుంచి టికెట్ దక్కింది.
Kadapa Lok Sabha Elections 2024 : వైఎస్ షర్మిలకా? అవినాష్ రెడ్డికా?
ఇప్పుడు పోటీలో ఉన్న అభ్యర్థుల్లో ఇద్దరూ వైఎస్ కుటుంబానికి చెందిన వారే. వైఎస్ అవినాష్ రెడ్డి.. వైఎస్ భాస్కర్ రెడ్డి కొడుకు. భాస్కర్ రెడ్డి.. వైఎస్సార్ కు తమ్ముడు అవుతారు. ఇక.. వైఎస్ షర్మిల.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు.
నిజానికి ఈ నియోజకవర్గం వైఎస్సార్ హయాంలో కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా మారింది. ఆ తర్వాత వైఎస్సార్ కొడుకు జగన్ పార్టీ పెట్టడంతో ఆయన పార్టీకే ప్రజలు ఓటేస్తున్నారు. వైఎస్సార్ కూడా గతంలో కడప లోక్ సభ స్థానం నుంచి ఎన్నికైనవారే.
1989 నుంచి 1998 వరకు వైఎస్సార్ కడప ఎంపీగా ఉన్నారు. ఆ తర్వాత 1999 ఎన్నికల్లో 2004 ఎన్నికల్లో వైఎస్సార్ సోదరుడు వైఎస్ వివేకానంద రెడ్డి కడప ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత 2009 లో జగన్ గెలిచారు. ఆయన తన పదవికి రాజీనామా చేసి 2011 ఉపఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచారు.
2014 ఎన్నికల్లో వైఎస్ అవినాష్ రెడ్డి, 2019 ఎన్నికల్లో కూడా ఆయనే కడప ఎంపీగా గెలిచారు. గత 30 సంవత్సరాల చరిత్ర తిరిగి చూసుకుంటే.. వైఎస్ కుటుంబీకులే ఈ నియోజకవర్గంలో గెలుస్తూ వస్తున్నారు. కానీ.. ఈసారి మాత్రం వైఎస్ కుటుంబీకులే ఇద్దరు వేర్వేరు పార్టీల నుంచి పోటీ చేస్తున్నారు.
ఇప్పటికే రెండు సార్లు గెలిచిన వైఎస్ అవినాష్ రెడ్డిని మూడోసారి కడప ప్రజలు గెలిపిస్తారా? లేక వైఎస్సార్ కూతురు వైఎస్ షర్మిలకు ప్రజలు పట్టం కడతారా? అనేది పెద్ద సస్పెన్స్ గా మారింది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మీద కడప ప్రజలు అభిమానం ఉన్నప్పటికీ.. వైఎస్సార్ కూతురు షర్మిల కోసం ఈసారి ఆమెకు ఓటేస్తారా? లేక.. మళ్లీ వైసీపీ అభ్యర్థి అవినాష్ రెడ్డికే పట్టం కడతారా? అనేది తేలడం లేదు.
అందుకే కడప లోక్ సభ ఎన్నికలు ప్రస్తుతం చాలా ఆసక్తికరంగా మారాయి. కడప లోక్ సభ పరిధిలోకి కడపతో పాటు బద్వేల్, పులివెందుల, కమలాపురం, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరు అసెంబ్లీ నియోజకవర్గాలు వస్తాయి. ఈ అన్ని నియోజకవర్గాలు కూడా వైసీపీకి కంచుకోట అనే చెప్పుకోవచ్చు.