KTR : కాంగ్రెస్‌లో చేరిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో వెంటనే రాజీనామా చేయించండి.. కేటీఆర్ డిమాండ్
తాజాగా సోషల్ మీడియాలో కేటీఆర్ చేసిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాంగ్రెస్ పార్టీ చెప్పేది ఒకటి అయితే చేసేది మరొకటి.. మేనిఫెస్టోలో పార్టీ ఫిరాయింపులపై హామీ ఇచ్చి.. ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ వేరే పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులను వాళ్ల పార్టీలో చేర్చుకుంటోందని మండిపడ్డారు.
KTR : కడియం శ్రీహరి, దానం నాగేందర్ గురించి ప్రస్తావించిన కేటీఆర్
అయితే.. ఇటీవల స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, తన కూతురుతో కలిసి కాంగ్రెస్ లో చేరిన విషయం తెలిసిందే. అలాగే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా కాంగ్రెస్ లో చేరారు.
కడియం శ్రీహరి కూతురు కడియం కావ్యకు వరంగల్ ఎంపీ టికెట్ ను కాంగ్రెస్ పార్టీ కేటాయించింది. కాంగ్రెస్ లోకి వచ్చి కూతురుకు ఎంపీ టికెట్ ఇప్పించుకున్నారు కడియం. బీఆర్ఎస్ నుంచి స్టేషన్ ఘనపూర్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇప్పుడు వరంగల్ నుంచి కూతురును ఎంపీగా గెలిపించుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నారు.
ఈనేపథ్యంలో కాంగ్రెస్ పార్టీపై ఎక్కుపెట్టారు మాజీ మంత్రి కేటీఆర్. రాహుల్ గాంధీని కూడా కేటీఆర్ ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై వెంటనే అనర్హత వేటు వేయాలని స్పీకర్ వెంటనే దీనిపై స్పందించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ ఇలాంటి చర్యలకు పాల్పడటంపై రాహుల్ గాంధీ ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు కేటీఆర్.
కాంగ్రెస్ ఎప్పుడైనా చెప్పేది ఒకటి.. చేసేది మరొకటి. వాళ్లు ఇచ్చే హామీలు ఒకటి ఉంటే.. ఆ హామీలకు వ్యతిరేకంగా వాళ్ల విధానాలు ఉంటాయి. వీళ్ల ఎన్నికల హామీలను చూసి ఓటేసే ప్రజలు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. హామీలపై నిబద్ధత ఉంటే రాహుల్ గాంధీ వెంటనే ఈ విషయంపై మాట్లాడాలి. తమ పార్టీ ఎమ్మెల్యేలను వెంటనే అనర్హులుగా ప్రకటించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
అలాగే.. కాంగ్రెస్ పార్టీలో చేరిన దానం నాగేందర్, కడియం శ్రీహరి ఫోటోలను తన ట్విట్టర్ అకౌంట్ లో షేర్ చేశారు కేటీఆర్. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టోను కూడా అందులో షేర్ చేశారు. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఉన్న 13 వ పాయింట్ ను రెడ్ మార్క్ తో హైలెట్ చేశారు.
అందులోనే కాంగ్రెస్ పార్టీ 10వ షెడ్యూల్ ను చట్ట సవరణ చేస్తామని ఎన్నికల హామీలో స్పష్టం చేసింది. కానీ.. ఆ పార్టీయే ముందు పార్టీ ఫిరాయింపులకు పాల్పడిందని కేటీఆర్ ప్రజలకు తెలిసేలా వివరించారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే.