Target BRS : తెలంగాణలో బీఆర్ఎస్ లక్ష్యంగా కాంగ్రెస్, బీజేపీ ఆపరేషన్..
అంటే తెలంగాణలో ఉన్న 17 స్థానాల్లో మూడు ప్రధాన పార్టీలు పోటీ చేస్తుండగా అందులో బీఆర్ ఎస్ ఎంపీలు 10 -12 మంది ఎంపీలు గెలువాని ఆ పార్టీ టార్గెట్ పెట్టుకుంది. అయితే ఆ దిశగా కసరత్తు కూడా చేస్తోంది. అయితే గత ఎన్నికల్లో బీజేపీ 4, కాంగ్రెస్ 2 ఎంపీ స్థానాలు గెలుచుకున్నాయి. బీఆర్ఎస్ 10 ఎంపీ స్థానాలు కైవసం చేసుకుంది.
మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా బీఆర్ ఎస్ పార్టీ క్యాడర్‌ను ఆకర్శించే పనిలో ఉంది. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిపోయారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తమ పదవులకు రాజీనామా చేయకుండానే కాంగ్రెస్ పార్టీలో చేరారు.
రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ కూడా ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఆయన కూడా బీఆర్ఎస్ పార్టీ వీడుతున్నట్లు పుకార్లు వచ్చినప్పటికీ ఆయన మాత్రం పార్టీ మారడంలేదని చెబుతున్నారు. అయితే పార్లమెంట్ ఫలితాల తర్వాత చాలామంది ఎమ్మెల్యేలు తమ నిర్ణయం తీసుకునే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది.
ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఎక్కువ సీట్లు గెలుచుకోకపోతే మాత్రం ఆ పార్టీ మనుగడ కష్టమే అని విశ్వసనీయ సమాచారం. గత సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలో ఉన్నప్పుడు కేవలం 10 స్థానాలు గెలుచుకున్న బీఆర్ఎస్ ఇప్పుడు ఎన్ని స్థానాలు గెలుచుకుంటుందనే విషయంపై పలు అనుమానాలు ఉన్నాయి. ఇప్పటికే పలు పలు పార్లమెంట్ నియోజకవర్గాలు పోటీ చేసేందుకు అభ్యర్థులు ముందుకు రాలేదని తెలుస్తోంది.
వరంగల్ నుంచి బీఆర్ఎస్ టిక్కెట్ వచ్చినా గెలువలేమంటూ కడియం శ్రీహరి కూతురు కాంగ్రెస్‌లో చేరి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇక మిగతా స్థానాల్లోనూ అభ్యర్థులు కరువై పోటీ చేయడానికి ముందుకు రాలేదని తెలుస్తోంది. ఇక ప్రచారంలోనూ ఈసారి బీఆర్ఎస్ కంటే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు దూకుడు పెంచాయి.
బీఆర్ఎస్ పార్టీని కేసులు వెంటాడుతున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కాం, మనీ లాండరింగ్ కేసులో ఎమ్మెల్సీ కవిత అరెస్టు అయ్యి ఇప్పటికీ నెల రోజులు దాటిపోయింది. అయినా ఇప్పటి వరకు బెయిల్ రాలేదు. వస్తుందో కూడా ఇంకా తెలియడం లేదు. ఈడీ అధికారుల రిమాండ్ కొనసాగుతుండగానే మరోవైపు ఆమెను సీబీఐ అధికారులు అరెస్టు చేసి కోర్టు అనుమతితో రిమాండ్ లోకి తీసుకున్నారు.
కాగా రాష్ట్రంలోనూ ఫోన్ ట్యాపింగ్ కేసులో గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై దుష్ప్రచారం కొనసాగుతోంది. మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడంతో, కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి కొనసాగిందంటూ దానిపై సమగ్ర విచారణ చేపట్టేందుకు యత్నం కొనసాగుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీని ఈ ఎన్నికల్లో గట్టిగా దెబ్బతీయాలనే ప్రయత్నంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఉన్నాయి. బీఆర్ ఎస్ పార్టీ క్యాడర్ ను దెబ్బతీస్తేనే ఈ రెండు పార్టీలు ఈ ఎన్నికల్లో లబ్ధి పొందే అవకాశం ఉంది.
పార్లమెంట్ ఎన్నికల అనంతరం బీఆర్ఎస్ పార్టీలో మిగిలేది ఆ కుటుంబంలోని నలుగురు మాత్రమే అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సహా కాంగ్రెస్ నేతలు పలు బహిరంగ సభల్లో అంటున్నారు. దీంతో గులాబీ పార్టీ నేతలు మానసికంగా మరింత కుంగిపోయే విధంగా పరిస్థితి ఏర్పడింది.
గత ఎన్నికల్లో అనూహ్యంగా 4 ఎంపీ స్థానాలు దక్కించుకున్న బీజేపీ ఈ సారి 10 నుంచి 12 స్థానాలు దక్కించుకుంటామని పార్టీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీకి కేంద్రంలో ఏం పని ఉందంటూ ప్రచార అస్త్రాన్ని ప్రయోగిస్తోంది. జాతీయ స్థాయిలో ప్రతిపక్ష పార్టీగా ఉన్న కాంగ్రెస్ ఏర్పాటు చేసిన ఇండియా కూటమిలో బీఆర్ఎస్ చేరకపోవడంతో కేసీఆర్, బీజేపీ ఒక్కటే అనే అస్త్రాన్ని కాంగ్రెస్ ఎన్నికల్లో వాడుకుంటోంది.
అందుకే బీజేపీకి లబ్ధి చేకూర్చేందుకే పలు చోట్ల డమ్మీ అభ్యర్థులను నియమించినట్లు కాంగ్రెస్ ఆరోపిస్తోంది. అయితే ఎన్నికలకు మరికొద్ది రోజుల సమయం మాత్రమే ఉండడంతో ఎన్నికల వేడెక్కుతోంది. ఈ నెల 24 నుంచి గులాబీ బాస్ కేసీఆర్ బస్సు యాత్రను చేపట్టనున్నారు. ఎవరి బలం ఎంత అనేది తేలాలంటే జూన్ 4వ తేదీ వరకు ఉత్కంఠ మాత్రం తప్పదు.