Pawan Kalyan Contest From Pithapuram : పవన్ కళ్యాణ్ పోటీ చేసే నియోజకవర్గం ఫిక్స్.. పిఠాపురంలో నన్ను గెలిపించండి అంటూ ఓటర్లను బతిమిలాడిన పవర్ స్టార్
పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్ కు పిఠాపురం నియోజకవర్గాన్ని ఫిక్స్ చేశారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ మూడు పార్టీల కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కు పిఠాపురం నియోజకవర్గాన్నే కేటాయించం వెనుక చాలా కారణాలు ఉన్నాయి. పిఠాపురం నియోజకవర్గంలో కాపు సామాజికవర్గం ఎక్కువగా ఉంటుంది. 90 వేలకు పైగా ఓట్లు కాపు వాళ్లయే ఉన్నాయి. అందుకే పవన్ కళ్యాణ్ కావాలని పిఠాపురం నియోజకవర్గాన్ని సెలెక్ట్ చేసుకున్నట్టు తెలుస్తోంది.
అయితే.. పిఠాపురం నియోజకవర్గంలో వైసీపీ నుంచి ప్రస్తుతం కాకినాడ ఎంపీగా ఉన్న వంగ గీత పోటీ చేస్తున్నారు. వంగ గీత కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో పిఠాపురం నియోజకవర్గంలోకి కాపులు ఎవరి వైపు మొగ్గుతారు అనేది ఆసక్తిగా మారింది.
ఈనేపథ్యంలో పవన్ కళ్యాణ్ టికెట్ కన్ఫమ్ కాగానే.. ఫస్ట్ టైమ్ పిఠాపురం నియోజకవర్గం నేతలు, కార్యకర్తలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఒకింత భావోద్వేగానికి గురయ్యారు.
అమ్మయినా అడిగితేనే అన్నం పెడుతుంది. అందుకే నేను కూడా తొలిసారి నోరు తెరిచి అడుగుతున్నా. నాకు ఓటు వేసి నన్ను గెలిపించండి అంటూ పవన్ కళ్యాణ్ అభ్యర్థించారు.
దాదాపు దశాబ్దం తర్వాత నోరు తెరిచి అడుగుతున్నా. నాకు ఓట్లు వేయండి. ఇప్పటి వరకు నేను ఎవ్వరినీ అభ్యర్థించలేదు. కానీ.. ఈరోజు నేను మిమ్మల్ని ఓటు వేయమని అడుగుతున్నా. చేతులెత్తి అభ్యర్థిస్తున్నా.. గుడ్డిగా ఓటు వేయకండన్నారు.
మనం 20 సీట్లు గెలిచి తీరాలి. పిఠాపురం నుంచే దాన్ని మొదలు పెడదాం. పిఠాపురం గెలుపే మన భవిష్యత్తుకు పునాది. పార్టీ కోసం పని చేసిన వారికి ప్రాధాన్యం ఇస్తాం. ప్రభుత్వంలో భాగస్వామ్యం కాబోతున్నాం అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.
ఒక్క ఓటు.. రెండు ఓట్లు కాదు.. లక్ష మెజారిటీతో పిఠాపురంలో నేను గెలవాలి. కాకినాడ పార్లమెంట్ దద్ధరిల్లాలి.. ఎన్నికలు ఇంకా కాలేదు కానీ.. మన దృష్టిలో ఎన్నికలు ఎప్పుడో పూర్తయ్యాయి. ఓటు వేయడమే తరువాయి. నేను ఎప్పుడో గెలిచేశాను. ప్రమాణ స్వీకారం మాత్రమే చేయాలి. ప్రమాణ స్వీకారం మాత్రమే మిగిలి ఉంది.. అంటూ పవన్ కళ్యాణ్ జనసైనికులను ఉద్దేశించి ప్రసంగించారు.
పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై తాజాగా వైసీపీ స్పందించింది. పిఠాపురం వైసీపీ నేతలు స్పందిస్తూ.. పవన్ కళ్యాణ్ నువ్వు ఎప్పుడూ కలలు మాత్రమే కంటూ ఉంటావు. అవి నిజం మాత్రం కావు. 2019 ఎన్నికల్లో నీకు భీమవరం, గాజువాకలో ఎలాంటి గతి పట్టిందో.. అదే గతి మళ్లీ పిఠాపురంలోనూ పట్టబోతోంది. తొందరపడకు. ఎన్నికలు ఇంకా పూర్తి కాలేదు.
ముందుంది మొసళ్ల పండుగ అంటూ పవన్ కళ్యాణ్ పై ఇప్పటి నుంచే ట్రోల్స్ స్టార్ట్ చేశారు. చూడాలి మరి.. పవన్ కళ్యాణ్ కనీసం ఈసారైనా పిఠాపురం నుంచి గెలిచి అసెంబ్లీలో అడుగు పెడతారా? లేక ఏకంగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి గెలిస్తే ముఖ్యమంత్రి అవుతారా అనేది.