CM Revanth Reddy : బీఆర్ఎస్ అంటే బిల్లా రంగా పార్టీ.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన వాఖ్యలు
మణుగూరు ప్రజాదీవెన సభలో ముఖ్యమంత్రి బీఆర్ఎస్ కు హెచ్చరిక
ఖమ్మంలోనే తెలంగాణ తొలి దశ ఉద్యమం ప్రారంభం..
1969లో తెలంగాణ తొలి దశ ఉద్యమం ఖమ్మంలోనే ప్రారంభమైందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మలిదశలోనూ అత్యంత కీలకమైన పాత్ర పోషించింది. ప్రభుత్వం ఏర్పడిన 90 రోజుల్లోనే అభయహస్తం గ్యారంటీలను అమలు చేశాం. మహిళలకు ఆర్టీసీ బస్సల్లో ఉచిత ప్రయాణం, రాజీవ్ గాంధీ ఆరోగ్య భీమా రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంపు, రూ.500లకే గ్యాస్ సిలిండర్, పేదలకు 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగంపై జీరో కరెంటు బిల్లులు ఇప్పటికే ప్రారంభించాం. ఇక నాలుగున్నర లక్షల ఇందిరమ్మ ఇండ్లను రూ.22,5000 కోట్లతో ఈ రోజు ప్రారంభించుకున్నాం. ఇప్పటికే 30వేల ప్రభుత్వ ఉద్యోగాలను నిరుద్యోగులకు అందజేశాం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
అంతర్జాతీయ స్థాయిలో పరువు తీసిన కేసీఆర్..
మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తెలంగాణ రాష్ట్ర పరువును జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తీసేశారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రాన్ని దొంగల్లా చొరబడి దోచుకున్నారని దుయ్యబట్టారు. ప్రాజెక్టుల పేర్లు మార్చి అందిన కాడికి కాజేశారు. కాళేశ్వరం మేడిగడ్డ, సుందిళ్ల ప్రాజెక్టులే ఇందుకు నిదర్శనం అన్నారు.
బీజేపీపీ, బీఆర్ఎస్ రెండూ ఒక్కటే..
బీజేపీ, బీఆర్ ఎస్ రెండు పార్టీలు ఒక్కటే అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కేవలం 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్న ఆపార్టీ నాయకులు లక్షణ్ కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు నెలలకు మించి ఉండదని అనడంలోనే ఇది బహిర్గతం అవుతుందని అన్నారు. ఈ రెండు పార్టీలు ఎలాగైనా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చాలని కుట్రలు పన్నుతున్నాయని అన్నారు. ఇందుకోసం మోడీ, కేడీ ఏకం అయ్యారని అన్నారు. మోడీ, కేడీ కుట్రలు చేస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. మాతో గోక్కుంటే ఎవరూ బాగుపడలేదని, అడ్డం వచ్చిన వారిని పండబెట్టి తొక్కుతామని హెచ్చరికలు జారీ చేశారు.