CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
రాష్ట్రంలో 25 లక్షల 50 వేల మంది రైతులకు రూ.22 వేల కోట్ల రుణమాఫీ జరిగింది. రైతు భరోసా నిధులను కూడా ఖాతాల్లో వేశాం. రాష్ట్రంలో విద్యుత్ వినియోగం 16 వేల మెగావాట్ల కు పైగా పెరిగినా ఎక్కడా విద్యుత్ కోతలు లేకుండా చూస్తున్నాం. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. 50 లక్షల పేద కుటుంబాలకు 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. 50 లక్షల కుటుంబాలకు రూ.500 లకే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం. ఇప్పటివరకు 150 కోట్ల మంది ఆడబిడ్డలు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేశారు. దాని కోసం రూ.4500 కోట్లు చెల్లించాం.
స్వయం సహాయక సంఘాలను గత ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. సున్నా వడ్డీ, పావలా వడ్డీ రుణాలు ఇవ్వలేదు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మహిళా సంఘాలకు పునరుజ్జీవం కల్పించాం. రాష్ట్రంలో 65 లక్షల స్వయం సహాయక సంఘాల మహిళలను కోటీశ్వరులను చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. వనపర్తి సాక్షి గా ఈ రోజు రూ.1000 కోట్ల రుణాలను ఆడబిడ్డలకు ఇచ్చాం. అదానీ, అంబానీ లే కాదు తెలంగాణ స్వయం సహాయక మహిళలు కూడా సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసేలా ప్రోత్సహిస్తున్నాం. 1000 బస్సులను స్వయం సహాయక మహిళలతో కొనుగోలు చేయించి ఆర్టీసీ కి అద్దెకు ఇచ్చేలా చేశాం.
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థిని విద్యార్థులకు బట్టలు కుట్టే పనిని స్వయం సహాయక మహిళలకు కల్పించాం. ప్రభుత్వ పాఠశాలను నిర్వహించే బాధ్యతను కూడా ఇచ్చాం. రాష్ట్రంలో 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్ల ను మహిళల పేరుతో ఇస్తున్నాం. దేశ చరిత్రలో ఇదొక రికార్డు. 22 వేల టీచర్లకు ప్రమోషన్లు, 35 వేల టీచర్లకు బదిలీలు చేసి వారి సమస్యలు పరిష్కరించాం. మెట్రో రైలు విస్తరణ నుంచి మూసీ పునరుజ్జీవం దాకా తలపెట్టిన అన్ని పనులను పూర్తి చేసి తీరుతాం. " అని ముఖ్యమంత్రి చెప్పారు.