Komati Reddy Venkat Reddy: అమెరికా టెక్నాలజీ సాయంతో గుంతల పూడ్చివేస్తాం
రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
తెలంగాణలో 15వేల కిలోమీటర్ల డబుల్ రోడ్ల నిర్మాణం
త్వరలో ఉప్పల్- నారపల్లి ఫ్లైఓవర్ పూర్తి చేస్తాం
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మండలాలు, గ్రామాలు తండాలలో సిసి రోడ్లు వేసేందుకు టెండర్లను పిలిచామని, పనులు రెండు నెలల్లో ప్రారంభింస్తామని పేర్కొన్నారు. గత కొద్ది సంవత్సరాలుగా రోడ్లపై గుంతలతో అనేక ప్రమాదాలు జరిగి ప్రజలు ఆస్పత్రుల పాలయ్యారని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో తమ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని రోడ్లకు మరమ్మతులు చేయడంతో పాటు, కొత్త రోడ్లు వేసేందుకు నిర్ణయం తీసుకుందని వివరించారు.
ఉప్పల్-నారపల్లి ఫ్లైఓవర్ నిర్మాణం మూడు సంవత్సరములలో కేవలం పిల్లర్ల దశలోనే ఆగిపోయిందని, తాము కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించి త్వరలో పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రాష్ట్రంలో 15 వేల కి.మీ డబుల్ రోడ్లు నిర్మించేందుకు టెండర్ల ప్రక్రియ ప్రారంభించనున్నామని, ఇటీవలే రోడ్లు, భవనాల శాఖలో 156 మందిని అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లుగా నియమించి రోడ్ల నిర్మాణాల పనులు వేగవంతం చేయాలని ఆదేశించినట్టు తెలిపారు.
2020 సంవత్సరంలో రోడ్లు నిర్మాణానికి రూ. 1800 కోట్లు మంజూరైనప్పటికీ పనులు ప్రారంభించలేదని, ఈ పనులకు అటవీ శాఖ అనుమతులు, ఎన్జీటీ గ్రీన్ బెల్ట్ క్లియరెన్స్ లేకపోవడంతో పనుల్లో పురోగతిలో లేదని, తమ ప్రభుత్వం అన్ని అనుమతులు తీసుకున్నదని, వెంటనే పనులు చేపట్టనున్నట్టు మంత్రి పేర్కొన్నారు. కార్యక్రమంలో శాసన మండలలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, రోడ్లు భవనాల శాఖ స్పెషల్ సెక్రటరీ డి.హరిచందన, అధికారులు పాల్గొన్నారు.