ఉద్యోగులను మభ్యపెడుతున్న ప్రభుత్వం
తపస్ రాష్ట్ర కార్యదర్శి పబ్బతి శ్రీనాకర్ రెడ్డి
గత కొంతకాలంగా జేఏసీల ఆధ్వర్యంలో ప్రభుత్వానికి అనేక సందర్భాల్లో విజ్ఞాపన పత్రాలు ఇస్తున్నప్పటికీ, రెండు సంవత్సరాల క్రితం ఇవ్వాల్సిన రెండు కరువు భత్యాలలో ఒకటి మాత్రమే ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. ఎంప్లాయిస్ ఫ్రెండ్లీ ప్రభుత్వంగా చెప్పుకునే ముఖ్యమంత్రికి పెరిగిన ధరలతో ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలు పడుతున్న ఇబ్బందులు కనిపించడం లేదా అని అన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే 317 బాధితుల సమస్యల పరిష్కారాన్ని వెంటనే చేపట్టాలని కోరారు.
లేకుంటే ఉద్యమ బాటే శరణ్యమని, అందులో భాగంగా ఈనెల 28న మండల తాసిల్దార్ లకు విజ్ఞాపన పత్రాన్ని ఇస్తున్నామని చెప్పారు. అప్పటికి ప్రభుత్వం స్పందించకుంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామన్నారు. జిల్లా అధ్యక్షులు రఘు వర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించడం కోసం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని, వారికి ఓటు హక్కు కల్పించడం కోసం చిత్తశుద్ధితో కృషి చేయాలని కోరారు.
గత రెండు సంవత్సరాల కాలంగా అనేక బిల్లులు పెండింగ్లో ఉన్నాయని, ఉపాధ్యాయులకు రావలసిన జిపిఎఫ్ బిల్లులు, మెడికల్ బిల్లులు, ఇంకా అనేక రకాల బిల్లులు పెండింగ్ లోనే ఉన్నాయని, వాటిని సత్వరం చెల్లించాలని కోరారు. జిల్లా ప్రధాన కార్యదర్శి మురళీధర్ మాట్లాడుతూ తమ ప్రభుత్వం వస్తే సిపిఎస్ విధానాన్ని రద్దు చేయడం పై తొలి సంతకం చేస్తామని, ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ పై సంవత్సరం గడుస్తున్న ఇప్పటివరకు ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోకపోవడం సమంజసంగా లేదని అన్నారు.
ప్రభుత్వం వెంటనే సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రాథమిక పాఠశాలలలో మౌలిక వసతులను కల్పించడం పై ప్రభుత్వం తగిన శ్రద్ధ తీసుకుని, విద్యారంగా అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి పరశురాములు వివిధ మండలాల అధ్యక్ష కార్యదర్శులు దేవదాసు, బుచ్చిరెడ్డి, జైపాల్ యాదవ్, వెంకటరామిరెడ్డి, విద్యాసాగర్, రమేష్, స్వప్న తదితరులు పాల్గొన్నారు.